#రాజు మెచ్చిన వంట#

ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడు. అతను చాలా మంచోడు. ప్రజలను సొంత బిడ్డలు గా చూసుకునేవాడు. ఎవరికి ఏ ఆపద వచ్చినా క్షణాల్లో ఆదుకునేవాడు. చిన్న,పెద్ద అనే తేడా లేకుండా అందరినీ సమానంగా చూసుకునేవాడు. ప్రజలు కూడా అతనిని దేవుని లాగా కొలిచే వాళ్ళు. అలాంటి రాజు కు చెడ్డ అలవాటు ఉండేది.అదే తిండియావ. ఒకరోజు తిన్న తిండి మరొక రోజు తినేవాడు కాదు. దేశ దేశాలలో ఉన్న అన్ని రకాల వంటలను తెప్పించుకొని పూటకోరకంగా లాగించేవాడు. అతను చూడని కూర లేదు.. .తినని వంట లేదు. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవ అన్నట్లు కొంతమంది వంట వాళ్ళు దేశ దేశాలు తిరుగుతూ వివిధ రకాల వంటలను గురించి తెలుసుకుంటూ రాజుకు వంట వండి మెప్పించే వాళ్లు. బహుమతులు పొందే వాళ్ళు. అలా చాలా కాలం రాజుకు మూడు తిను బండారాలు ఆరు పానీయాలు అన్నట్లు కాలం గడిచిపోయేది. లోకంలో కొత్త వంటలు ఎన్నని ఉంటాయి. పూటకో రకం వంట చేయాలంటే అంత సులభం కాదు కదా…. దాదాపుగా అన్ని రకాల వంటల రుచులు చూసేసాడు. దాంతో కొత్త వంటలు చేయలేక చేతులు ఎత్తేశారు. గరిటెలు దించేశారు. దాంతో రాజుకు చివరిసారిగా ఎవరు తినని వంటను తినాలని ఆశపడ్డారు. అలాగే తిండి యావకు ముగింపు పలకాలని అనుకున్నారు.

దాంతో రాజుకు తన జీవితంలో ఎవరైతే మంచి వంట వండి పెడతారో వారికి పదివేల వరహాలు బహుమతిగా ఇస్తాను అని చాటింపు వేయించాడు. పదివేల వరహాలు అంటే మాటలు కాదు కదా అలాగే జీవితాంతం కాలు మీద కాలు వేసుకుని హాయిగా బ్రతకవచ్చు. దాంతో దేశ దేశాల నుంచి వివిధ రకాల వంట వాళ్ళు అక్కడికి వచ్చారు. అంతా వివిధ రకాల వంటలను చేసి రాజు కి రుచి చూపించారు.కానీ రాజు ఆ వంటలను రుచి చూసి ఓస్ ఇంతేనా అని అనసాగారు. అలాగే వంట పేరు కూడా చెప్పేసేవారు. నెల రోజులు తిరిగేసరికి ఏ వంట చేయాలో ఎవరికీ అర్థం కాలేదు. వంట వాళ్లంతా వెనక్కి తిరిగి వెళ్ళి పోయారు. దాంతో రాజుకు విచారం ఎక్కువైంది. ఎప్పుడు అదే ఆలోచన.దాంతో రాజు జబ్బు పడ్డాడు. ముఖం పీక్కుపోయింది. జీవకళ పోయింది. గడ్డం పెరిగిపోయింది. బట్టలు వదులు అయినాయి. మంచం మీద నుంచి లేవలేక పోతున్నాడు. అలాగే పది రోజులు ఉంటే రాజు బతకడం కష్టమే. ఇంత మంచోడు. ప్రజలను చాలా బాగా చూసుకునేవాడు.భూమిలో కలిసిపోతుంటే చాలా బాధగా ఉంటుంది అని ప్రజలు కన్నీళ్లు పెట్టుకో సాగారు. అలాగే ఆ నోట ఈ నోట పాకి ఒక పూరి పాకలో ఉండే అవ్వకు విషయం తెలిసింది. అలాగే అవ్వ ఎలాగైనా రాజును బ్రతికించుకోవాలని ఆలోచించసాగింది. ఒక ఉపాయం ఆలోచించింది. అలాగే అవ్వ కొంగు బిగించి కోటకు బయలుదేరింది. అందరూ అవ్వను చూసి”ఒసేయ్ ముసలి దాన నీతో ఏమవుతుంది. చేయి తిరిగిన వంట వాళ్లే మెప్పించలేకపోయారు.నీతో ఏమవుతుంది అని గేలి చేశారు. బంగారు నాణేల మీద ఆశపడి వచ్చినట్టున్నావు.ఇక్కడ్నుంచి పో పో”అని చెప్పారు. అందుకే ముసలామె నవ్వుతూ “నాకెందుకు నాయనా బంగారు వరహాలు అని చెప్పింది. చచ్చాక పాడే మీద పరిపించుకోవడానికా”అని అనింది. మా రాజు మంచోడు జనాలు మెచ్చినోడు. కలకాలం భూమిమీద నివసించే ప్రజలకు మేలు చేసేటోడు.

“కలకాలం భూమ్మీద పచ్చని చెట్టులా వెలిగిపోతా పేదవాళ్లను కాపాడవలసిన వాడు కళ్ళముందే కాటికి పోతావుంటే ఎలా తట్టుకునేది అని అందుకే ఊరుక్కుంటూ వచ్చా” అనింది. ఆ మాటలు విన్న మహారాణి “ఏ పుట్టలో ఏ పాము ఉందో ఎవరికి తెలుసు ఆమె పని ఆమెనుచేయనివ్వండి”అంది. అవ్వ నాలుగు ఉల్లిగడ్డలు తెచ్చింది కమ్మని వాసన వచ్చేదాకా ఎర్రని నిప్పుల మీద వేసి అటు ఇటు తిప్పింది.వేరుశనగ బుడ్డలు పెనం మీద ఒకటి కూడా నల్లబడకుండా దోరగా వేయించింది.వాటికి పచ్చి మిరపకాయలు, టమాటాలు కలిపి రోట్లో వేసింది.చింతపండు జీలకర్ర బెల్లం ముక్క ఉప్పు కలిపి బాగా దంచింది. వేలితో కొంచెం నాలిక మీద వేసుకొని చప్పరించింది. నవ్వుతూ గిన్నెలోకి మొత్తం ఎత్తింది.

అన్నం గిన్నె తెచ్చి సగం దాకా నీళ్లు పోసి కట్టెల పొయ్యి మీద పెట్టింది.బాగా మరిగిన తర్వాత ఒక అరగంట బియ్యాన్ని నానబెట్టింది.అన్నం మెతుకులు ఉడికినాక రెండింతలు రాగిపిండి కొంచెం కొంచెంగా కలిపి ఉండలు కట్టకుండా ఉడకబెట్టింది.చేతికి వెన్నపూస పోసుకొని రాగి ముద్దలు కట్టింది ఒక పళ్లెంలో రెండు వేడి వేడి రాగి ముద్దలు పచ్చడి కమ్మని నెయ్యి పోసి రాజు ముందు ఉంచింది. అందరూ అది చూసి లోలోపల నవ్వుకోసాగారు.

రాజు దానికేసి వింతగా చూశాడు.అలాంటి వంట జీవితంలో చూడలేదు.అదే మొదటిసారి తిందామా వద్దా అని ఆలోచిస్తూనే నెయ్యి వేసిన రాగి ముద్దను చేతిలోకి తీసుకొని పచ్చడి కలుపుకొని నోటిలో పెట్టుకున్నాడు. కారం కారంగా,పుల్లపుల్లగా, తియ్య తియ్యగా,వేడివేడిగా, నెమ్మదిగా గొంతులోకి దిగింది.ఆ కమ్మటి రుచికి రాజు మొహం ఒక్కసారిగా ఆహా…అమోఘం… అపురూపం… అంటూ ఆనందంతో గట్టిగా అరిచాడు. ముద్ద మీద ముద్ద వరుసగా కడుపు నిండా చిరునవ్వుతో తిన్నాడు. అది చూసి అందరూ ఆనందపడ్డారు.ఆ ఆనందంతో అవ్వను గాలిలోకి ఎత్తి చిందులు వేశారు. రాణి పరుగున వచ్చి మంచం మీద నుండి లేచి వచ్చినా మొగుడిని చూసి ఆనందంతో అవ్వ దగ్గరికి వెళ్లి “అవ్వ దేశ దేశాల్లో ఎవరికి రాని ఆలోచన నీకెలా వచ్చింది” అని అంది.

అవ్వ చిరునవ్వు నవ్వి “చూడు తల్లి మీది రాజవంశం ఖరీదైన వంటలే తప్ప పేదవాళ్లు తినే తిండి ఎంత మంచిగా ఉన్నా అంతపురం లోకి తీసుకొని రావడం జరగదు. వచ్చినా వంట వాళ్ళందరూ రకరకాల కూరగాయలు పళ్ళు ఆకుకూరలు తెచ్చి వంటలు చేశారే కానీ పల్లె గడపలో చేసే వంటలు చేయలేదు అందుకే ఆ నమ్మకంతోనే రాజుకి ఎప్పుడూ రుచి చూడని వంట చేసి పెట్టాను”అని అనింది. రాణి సంతోషంగా అవ్వను ముద్దు పెట్టుకుంటూ తన మెడలోని విలువైన రత్నాల హారాన్ని తీసి అవ్వ మెడలో వేసింది.

Leave a Comment