తెలివైన జింక పిల్ల

ఒక అడవిలో చిన్న నది ప్రవహిస్తూ ఉండేది.ఆ నది నిండా కొన్ని మొసళ్ళు ఉండేవి.ఆ అడవి లోని జంతువులకు నీళ్ళు తాగాలంటే చాల భయం.ఆ అడవిలో చిన్న జింక పిల్ల ఉంది.అది చాలా తెలివైనది.దానికి తాను ఉంటున్న అడవి నచ్చలేదు.ఆ నదిని దాటి అవతల ఒడ్డుకు పోవాలని అనుకొంది.కానీ ఆ నదిని దాటడానికి ఒక ఉపాయాన్ని ఆలోచించింది.ఒక రోజు నది ముందు నిలబడి ఒక మొసలి తో”మొసలి బావా……..మొసలి బావా…….మన అడవికి రాజైన సింహం మీకందరికీ విందును ఇవ్వాలనుకొంటుంది.మొత్తం మీరెంత మందో కనుక్కొని రమ్మని చెప్పింది”అని అన్నది.

మొసలి కాసేపు ఆలోచించింది.కానీ నదిలో ఎన్ని మొసళ్ళు ఉన్నాయో సరిగా చెప్పలేక పోయింది.

“వెంటనే నీవు పోయి అందరినీ పిలుచుకొని రా”అని అంది జింక పిల్ల.మొసలి నదిలో ఉన్న మొసళ్ళను అన్నింటినీ పిలుచుకొని వచ్చింది.జింక పిల్ల ఆ మొసళ్లను చూసి”ఇలా గుంపులు గుంపులు గా ఉంటే ఎలా లెక్క పెట్టగలను.ఒకరి వెనుక ఒకరు వరుసగా నిలబడండి లెక్క పెడతా”అని అంది.మొసళ్లన్నీ సంతోషంగా అలాగే నంటూ వరుసగా నిలబడ్డాయి.”ఒకటి….రెండు…..మూడు…..అంటూ ఒక దాని మీద నుంచి మరొక దాని మీదకు చెంగు చెంగున నదిని దాటింది.

మొసళ్ళని చూసి ఆ జింక పిల్ల పక పకా నవ్వుతూ….విందు లేదు ఏమీ లేదు. అంతా ఉత్తిత్తి దే అంటూ పారిపోయింది.అప్పుడు మొసళ్ళు బిక్క మొహం వేశాయి.

Leave a Comment