
ఒక అడవి లో కొన్ని పక్షులు,జంతువులు కలిసి మెలిసి జీవిస్తూ వుండేవి.ఒక రోజు అనుకోకుండా అడవికి నిప్పు అంటుకుంది.అది కొద్ది కొద్ది గా పెరగసాగింది.పక్షులు,జంతువులు ఎవరి దారిన వాళ్ళు తలో దిక్కూ పారిపోతున్నాయి.కొన్ని మాత్రం పారి పోవడం చేత కాక మంటల్లో పడి చనిపోతున్నాయి.కానీ…….ఒక్క పిట్ట మాత్రం పారిపోకుండా తన చిన్న ముక్కు తో దగ్గర్లో ఉన్న చెరువులో నుండి కొద్ది కొద్ది గా నీరు తెచ్చి ఆ మంటల్లో పోయాసాగింది.
అది చూసిన కొంగ “ఓసీ…….తిక్కదానా!నీవు పిడికెంత లేవు. నీ చేత ఏమౌతుంది.నీవు ఎన్ని నీళ్లు పోసినా ఈ మంటలు ఆరిపోవు. పో……..పో…….పోయి నిన్ను నీవు కాపాడుకో” అని అంది.పిట్ట చిరునవ్వు తో అవును నిజమేగా……నా ఒక్క దానితో కాక పోవచ్చు. కానీ చిన్న చినుకు చినుకు కలిసి వాన గా మారేది.అడవిలో అన్నీ అన్నీ చేయి చేయి కలిపితే అడవిని కాపాడుకోవడం ఎంత సేపు “అని అంది.ఆ మాటలను కొంగతో పాటు ఇతర జంతువులు విన్నాయి.అవును నిజమే కదా అనుకున్నాయి.వెంటనే ఆ జంతువులు అన్నీ పారిపోవడం మానుకొని మంటల మీద నీళ్ళు చల్లడం ప్రారంభించాయి.ఇంతలో అడవి మొత్తం మంటలు చల్లారి అడవిని కాపాడుకొన్నాయి.కావున అందరూ కలిసి కట్టుగా పని చేస్తే ఏదైనా సాధించవచ్చు.