ఉడుత చేసిన పాయసం

ఒక చెట్టు మీద ఒక ఉడుత ఉండేది. ఒక రోజు ఉడుత కు పాయసం తాగాలి అనిపించింది.కానీ ఇంటిలో ఏమి లేవు.దాంతో బాగా ఆలోచించింది.

చుట్టుపక్కల ఉన్న జంతువులను బురిడీ కొట్టించి పాయసం చేసుకోవాలి అనుకొంది.పక్కనే ఉన్న కుందేలు ఇంటికి పోయింది.”కుందెలన్నా…. కుందేలన్నా …..పాయసం లోనికి కొంచెం చక్కెర తక్కువైంది.ఒక కప్పు చక్కెర అప్పుగా ఇవ్వవా మళ్ళీ కొద్ది రోజుల తర్వాత తిరిగిస్తా”అని అడిగింది.దానిదేముందిలే తమ్ముడూ తీసుకో అంటూ ఆ కుందేలు ఒక కప్పు చక్కెర ఇచ్చింది.

ఉడుత ఆ చక్కెర ఇంట్లో పెట్టేసి జింక దగ్గరకి పోయింది.”జింక బావా…. జింక బావా…. పాయసం లోనికి కొంచెం సేమ్యా తక్కువయింది. కొంచెం సేమ్యా ఇస్తావా మళ్ళీ తిరిగి ఇస్తా”అని అడిగింది.”దానిదేముందిలే బావమరిది తీసుకో “అంటూ ఆ జింక ఒక కప్పు సేమ్యా తెచ్చి ఇచ్చింది.

ఉడుత ఆ సేమ్యా ఇంట్లో పెట్టేసి ఆవు దగ్గరికి పోయింది. “ఆవత్తా….. ఆవత్తా…..పాయసం లోనికి కొంచెం పాలు తక్కువ అయ్యాయి.ఒక కప్పు పాలు ఇస్తావా మళ్ళీ తిరిగి ఇస్తా “అని అడిగింది. “దానిదేముందిలే అల్లుడూ తీసుకో “అంటూ ఆ ఆవు ఒక కప్పు పాలు తెచ్చి ఇచ్చింది.అలా ఆ ఉడుత చక్కెర, సేమ్యా,పాలు అన్నీ తెచ్చుకొంది. నవ్వుకుంటూ సంబరంగా తీయని పాయసం చేసుకొంది.హాయిగా కాలు మీద కాలు వేసుకుని ఆనందంగా పాయసం తాగుదామని పాయసం గిన్నె తీసుకొని ఇంటి ముందు కూర్చుంది.

అంతలో అక్కడికి కుందేలు వచ్చింది. ఏం తమ్ముడూ ఒక్కనివే పాయసం తాగుతున్నావా ఈ అన్నకు ఏమన్నా ఇచ్చేది ఉందా లేదా అని అడిగింది.రా అన్నా నీ కన్నా ఎక్కువా అని పాయసం పోసి ఇచ్చింది ఉడుత.కుందేలు తాగి భలే హాయిగా ఉంది తమ్ముడూ కమ్మగా.జన్మలో ఇంత కమ్మనైన పాయసం ఎప్పుడూ తాగలేదు అంటూ మెచ్చుకొని వెళ్ళిపోయింది.

ఉడుత ఒక నిండా పాయసం పోసుకుంది తాగడానికి.ఇంతలో అక్కడికి జింక వచ్చింది.ఏం బావమరిది పాయసం వాసన పది మైళ్ళ వరకు గుమ్మున కొడతా ఉంది. నాకు ఏమైనా ఇచ్చేది ఉందా లేదా అని అంది.ఉడుత నోట్లో వెలక్కాయ పడ్డట్టు అయింది.తాగేముందే రావాలా ఇది కూడా ఇప్పుడే అనుకుంటూ లోపల్లోపలే బాధ పడుతూ దానిదేముందిలే జింక బావా…..లోపలికి రా తాగిపోదువు గాని అంటూ గ్లాసు దానికి అందించింది.

జింక దాన్ని లొట్టలేసుకుంటూ తాగి అబ్బా……ఎంత బాగుందో అమ్మ చేతి వంటలా.ఈసారి ఎప్పుడు పాయసం చేసినా ఈ బావను మాత్రం పిలవడం మరచిపోవద్దు అంటూ వెళ్ళిపోయింది.ఉడుత గిన్నె లోకి తొంగి చూస్తే ఒక్క గ్లాసు మిగిలింది.బైట కూర్చొని తాగేటప్పుడు ఇంకేదైనా జంతువు వస్తే కష్టం అనుకుంటా పైకి లేచి వెళ్ళబోయింది.అంతలో అక్కడికి ఆవు వచ్చింది.ఏమల్లుడూ……పాయసం భలే రుచిగా చేసినావంటనే.జింక,కుందేలు నాకు కనబడి ఆ కమ్మని రుచి గురించి పదే పదే చెబుతావుంటే నోరూరి పరిగెత్తుకుంటూ వచ్చినా.నాకు ఏమైనా ఉందా లేదా అంది.దాని చేతి లోని గిన్నె వంక లొట్టలేసుకుంటూ చూస్తూ.ఉడుత ఏమీ చేయలేక నీరసంగా రా అత్తా నీకు గాక ఇంకెవరికి ఇస్తా అంటూ మిగిలింది ఆ గ్లాసు లో పోసి అందించింది.

ఆవు కమ్మగా దానిని తాగి ఆహా……ఎంత మజాగా ఉంది అల్లుడూ నీ చేతి పాయసం నేనెప్పుడూ ఇలాంటి రుచికరమైన పాయసం తాగనే తాగలేదు.నా దగ్గర తీసుకున్న అప్పుకేం తొందరేంలేదు గాని నిదానంగా నీ దగ్గర ఉన్నప్పుడే తీర్చులే అంటూ వెళ్ళిపోయింది.పాయసం ఒక చుక్క తాగకపోయినా అప్పు మాత్రం మిగిలినందుకు గుడ్లు తేలేసింది ఉడుత.

Leave a Comment